పుల్వామా దాడిని దేశం యావత్తు ఖండిస్తోంది. క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా ( CCI ) కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఇమ్రాన్ ఖాన్‌ చిత్రపటాలను ‘ఆల్-‌రౌండర్‌’ రెస్టారెంట్‌ నుంచి తొలగించింది. తాజాగా పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ మ్యాచ్‌ల ప్రసారాన్ని కూడా బ్రాడ్‌కాస్టింగ్‌ అధికారులు నిలిపివేశారు. కొన్ని నెలల్లో ప్రారంభం కానున్న ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో టీమిండియా మ్యాచ్‌ ఉండకుండా చూడాలని బీసీసీఐను సీసీఐ కోరింది. ప్రపంచకప్‌ 2019లో భాగంగా టీమిండియా-పాక్‌ మధ్య జూన్‌ 16 న మాంచెస్టర్‌ వేదికగా మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో సీసీఐ సెక్రటరీ సురేశ్ బఫ్నా మాట్లాడుతూ, ‘ఇంత జరిగినా పాకిస్థాన్ ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ ఇంకా నోరు మెదపలేదు. ఆయన మౌనం వెనుక వాళ్ల తప్పున్నట్టు స్పష్టం అవుతోంది. మన జవాన్ల మీద జరిగిన దాడిని మేం మూకుమ్మడిగా ఖండిస్తున్నాం. సీసీఐ క్రీడా రంగానికి చెందిందే కావచ్చు. కానీ మాకు దేశమే ముఖ్యం. తర్వాతే క్రీడలు. ఈ దాడిపై ఇమ్రాన్‌ ఖాన్‌ కచ్చితంగా మాట్లాడి తీరాలి. వాళ్ల దేశం వైపు ఏ తప్పూ లేకపోతే ఆయన ఎందుకు మాట్లాడటం లేదు? ఇకపై పాక్‌తో ఇండియా క్రికెట్ ఆడకూడదని కోరాం’ అని చెప్పారు.