వచ్చే ఏడాది మొదటి నుంచి ప్రయాణికులకు భారీ రాయితీలు ప్రకటించింది భారతీయ రైల్వే. వర్గాల వారిగా 10 నుంచి 100 శాతం రాయితీలను ప్రకటిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రజా సంబంధాల ముఖ్య అధికారి తెలిపారు. ఇప్పటికే కొన్ని వర్గాల ప్రయాణికులకు రైల్వే శాఖ కొన్ని రకాల రాయితీలు ఇస్తోంది. తాజాగా ఎల్‌బీటీక్యూ వర్గాలకు సైతం రైల్వే శాఖ నుంచి భారీ రాయితీ లభించింది. 60 ఏళ్లకు పైబడిన ట్రాన్స్‌జెండర్ ప్రయాణికులకు 40 శాతం రాయితీని ప్రకటిచింది భారతీయ రైల్వే శాఖ.జాతీయ రైల్వే ప్రజా సంబంధాల ముఖ్య అధికారి సునిల్ ఉదాసి మాట్లాడుతూ ‘‘ట్రాన్స్‌జెండర్లలోని వయోవృద్ధ ప్రయాణికులకు టికెట్ల కొనుగోలులో 40 శాతం రాయితీ ప్రకటిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇది వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి అమలులోకి రానుంది’’ అని అన్నారు.
ఇదే కాకుండా 53 విభిన్న కేటగిరీల్లో 10 నుంచి 100 శాతం రాయితీలను రైల్వే శాఖ ప్రకటించింది. విద్యార్థుల ఇంటి ప్రయాణానికి, విద్యాపరమైన టూర్లకు 50 శాతం రాయితీనిచ్చింది. షెడ్యూల్డ్ ట్రైబ్స్ విద్యార్థులకు ఇది 75 శాతమని పేర్కొంది. ఇది రెండవ తరగతి, స్లీపర్‌కు వర్తిస్తుందని రైల్వే శాఖ పేర్కొంది.