మధ్యప్రదేశ్‌లోని సీధీ జిల్లాలో అందరినీ హడలెత్తించే ఉదంతం చోటుచేసుకుంది. సీధీకి 70 కిలోమీటర్ల దూరంలోని కుసమీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమక్ష్ గ్రామంలో ఒక ప్రియురాలు తన ప్రియుడి మృతదేహాన్ని ఇంటిలోనే సమాధి చేసేంది. గడచిన రెండు నెలలుగా ఆ సమాధి పక్కనే నిద్రిస్తూ ఉంటోంది. ఒక యువకుడు అదృశ్యమయాడంటూ అతని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపధ్యంలో ఈ కలకలం రేపే ఉదంతం వెలుగు చూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: జానూ సింగ్(25), సత్నా జిల్లాకు చెందిన ఇషాన్ మొహమ్మద్(27) ప్రేమించుకున్నారు. కొంతకాలం తరువాత వీరిద్దరూ కమక్ష్ గ్రామానికి వచ్చి ఉండసాగారు. వీరి మధ్య గత ఏడాది డిసెంబరులో వివాదం నెలకొంది.

ఈ నేపధ్యంలో ఆ యువకుడు డిసెంబరు 7 ఉరి వేసుకున్నాడు. అయితే ఇషాన్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు తాను ఇంటిలో లేనని జానూ పోలీసులకు చెప్పింది. తాను ఇషాన్ మృతదేహాన్ని ఇంటిలోనే ఖననం చేశానని తెలిపింది. రెండు నెలల నుంచి ప్రియుని సమాధి పక్కనే జానూ నిద్రించసాగింది. కాగా ఇషాన్ అదృశ్యంపై అతని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో పోలీసులు జానూను ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.