ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

కిచొండ గ్రామానికి చెందిన జి.గణేష్, శిల్ప ఇద్దరూ యూసూఫ్‌గూడలోని నిమ్స్‌మేలో శిక్షణ పొందుతూ వేర్వేరు హాస్టళ్లలో ఉంటున్నారు. చిన్నప్పటినుంచి స్నేహితులైన వీరు ప్రేమించుకుంటున్నారు. దసరా సెలవులకు ఇంటికివెళ్లి వీరు ఇటీవలే తిరిగి వచ్చారు. ఈ నెల 23వ తేదీ రాత్రి 11 గంటల ప్రాంతంలో వీరు మరికొందరితో గొడవపడ్డారు. ఆ తర్వాత కొద్దిసేపటికే గణేష్‌ తనతోపాటు తీసుకువచ్చిన కత్తితో కడుపులో పొడుచుకోగా, శిల్ప కూడా అదే కత్తిని తీసుకుని పొడుచుకుంది.

తీవ్రంగా గాయపడిన వీరిని హాస్టల్‌ విద్యార్థులు, సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వీరు ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియరావడం లేదు. తమ ప్రేమకు పెద్దలు అడ్డుచెప్పడం వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండవచ్చుననే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దసరా సెలవులకు ఇంటికి వెళ్లినప్పుడే ఈ గొడవ జరిగి ఉంటుందని, రైల్వేస్టేషన్‌లో దిగగానే కత్తిని కొనుగోలు చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. నిమ్స్‌ మే ప్రతినిధి అంకిత్‌ భట్నాగర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వీరు కోలుకున్న తర్వాత వాస్తవాలు తెలుస్తాయని తెలిపారు.