మహారాష్ట్రలో పట్టపగలే దారుణం జరిగంది. తనను ప్రేమించడం లేదనే అక్కసుతో ఓ యువకుడు ఒక మహిళా లెక్చరరు (26) మీద పెట్రోలు పోసి నిప్పంటించాడు. వార్ధా జిల్లా నందోరి చౌక్‌లో వికేశ్‌ అనే యువకుడు నడిరోడ్డుపైనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. స్థానికులు మంటలు ఆర్పి ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. దీనిపై సత్వరం విచారణ చేపడతామని ప్రకటించింది. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారిస్తున్నారు.

Advertisement

దడోరా గ్రామానికి చెందిన అంకిత (26)కి అదే గ్రామానికి చెందిన వికేశ్‌(27)తో కొంతకాలంగా పరిచయం ఉంది. అతడికి పెళ్లయి, భార్య, ఏడు నెలల కొడుకు ఉన్నారు. అయినా అతడు ఈ యువతి వెంటపడి వేధించేవాడు. ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న ఆమె అతడి ప్రవర్తన నచ్చక రెండేళ్ల నుంచి అతడిని దూరం పెట్టింది. సోమవారం ఉదయం కళాశాల వద్ద కాపుకాసిన వికేశ్‌ అంకితతో ఘర్షణకు దిగాడు. వెంటనే తన వెంట తెచ్చిన పెట్రోలును ఆమెపై చల్లి నిప్పంటించాడు. చుట్టుపక్కలవారు గమనించేలోగా ద్విచక్ర వాహనంపై పారిపోయాడు. మంటల్లో చిక్కుకున్న అంకితను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం నాగ్‌పుర్‌కు తరలించారు. ఈ దాడిలో నిందితుడికి మరో ఇద్దరు సహకరించినట్లు స్థానికులు చెబుతున్నారు.

ప్రేమ విఫలం కావడంతోనే వికేశ్‌ ఈ దాడికి పాల్పడి ఉంటాడని జిల్లా ఎస్పీ తెలిపారు. పెళ్లయినా అతడు వేధింపులు మానలేదని, గత ఏడాది ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాడని వివరించారు. అతడి కారణంగానే గతేడాది అంకిత వివాహ జీవితం విచ్ఛిన్నమైపోయినట్టు ఆమె బంధువు శుభమ్‌ తెలిపారు. ఈ ఘటనపై సత్వరం విచారణ చేపడతామని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ తెలిపారు.