ప్రేమించిన అమ్మాయి ఆరు నెలల గర్భవతి కాగా ఆస్పత్రిలో అబార్షన్ చేసే సమయంలో మృతి చెందింది. ప్రేయసి మృతి గురించి అటు అమ్మాయి ఇంట్లో ఇటు అబ్బాయి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పొరుగు రాష్ట్రానికి తీసుకువచ్చి మృతదేహాన్ని దహనం చేశాడు. మృతదేహం ఆనవాలతో పోలీసులు తమదైన శైలిలో నిందితులను మంగళవారం పట్టుకున్నారు. పరిగి డిఎస్పీ రవింద్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్- బీజాపూర్ అంతర్రాష్ట్ర రహదారి 163పై పరిగి మండలం గోవిందాపూర్ గేటు సమీపంలో ఈనెల 5న గురువారం గుర్తు తెలియని మహిళ తగలబడిన మృతదేహాన్ని స్థానికుల సమాచారంతో విచారణ ప్రారంభించారు. మృతదేహం కొంత కాలిపోగా మిగిన మృతదేహం, బట్టలు, సంఘటనా స్థలానికి వచ్చిన కారు టైర్ల గుర్తులు, పెట్రోల్ తెచ్చిన బాటిల్ ఆధారం, ఆస్పత్రి బెడ్‌షీట్ ఆధారాలు సేకరించారు.

Advertisement

ఈ ఆధారాలను వెతుకుతూ పొరుగురాష్ట్రం కర్నాటకకు వెళ్లారు. గుల్బర్గా, కర్నాటక ఏరియాలోని పోలీస్‌స్టేషన్‌లలో మిస్సింగ్ కేసుల వివరాలు సేకరించారు. అక్కడ బ్రహ్మాపూర్ పోలీస్‌స్టేషన్‌లోని మిస్సింగ్ కేసు ఆధారంగా ఈ అమ్మాయి వివరాలు సేకరించారు. తప్పిపోయిన అమ్మాయి పేరు ఇస్తెరాణి శిభ(22) అని తండ్రి జయప్రభు శ్యాముల్‌గా గుర్తించారు. శిభ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. శిభ అక్కడి ఓ అబ్బాయితో ప్రేమలో పడి ఆరు నెలల గర్భవతి అయ్యింది.

గర్భం తొలగించుకునేందుకు గుల్బర్గాలోని మాతోశ్రీ హాస్పిటల్‌లో అబార్షన్ చేయగా అమ్మాయి మృతి చెందింది. అమ్మాయి మృతి చెందగా తన ప్రియుడు తన ప్రేయసి మృతదేహాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక్కడే సమీపంలో ఏమైనా చేస్తే తెలిసిపోతుందని బావిం చి తన ఇద్దరి స్నేహితులతో కలిసి ప్రియుడు కారులో అమ్మాయి మృతదేహాన్ని తీసుకువచ్చి పరిగి మండలం గోవిందాపూర్ గేటు సమీపంలో ఉన్న కాలువలో పడవేసి తమ వెంట తీసుకువచ్చిన పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయారు. ఈ మేరకు ఈ కేసును తదుపరి దర్యాప్తు కోసం బ్రహ్మాపూర్‌కు పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేసినుట్ల తెలిపారు. కాగా ఈ కేసు లో నిందితులైన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.