ప్రేమికుల దినోత్సవంలో శృతి మించితే ఊరుకునేది లేదని తమిలనాడు పోలీసులు అప్పుడే హెచ్చరికలు చేశారు . విచ్చలవిడి వ్యవహారాలపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు . ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం కోసం యూత్ ఆశగా ఎదురుచూస్తున్నారు . అయితే ఈ కారణంతో శ్రుతి మించి ప్రవర్తిస్తే కఠినచర్యలు తప్పవని తమిళనాడు పోలీసులు హెచ్చరిస్తున్నారు. పార్కుల్లో విచ్చలవిడిగా తిరగడం , ఇతరులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. తాజాగా మదురైలోని ఓ పార్కులో కొంతమంది ప్రేమికులు ఉల్లాసంగా గడుపుతుండగా స్థానిక పోలీసులు వారిని పట్టుకున్నారు . తల్లిదండ్రులకు సమాచారమిచ్చి వారి సమక్షంలోనే మందలించి ఆ తరువాత విడిచి పెట్టారు .

మదురైలోని పార్కు రాజాజీ చిన్నపిల్లల పార్కు అన్నా సెంటినరీ పార్కు అళగర్ కోయిల్ పరిసరాలు , తిరుమలై నాయకర్ మహాల్ తదితర ప్రాంతాల్లో అలికిడి లేని చోట ప్రేమ జంటలు శ్రుతిమించి ప్రవర్తిస్తున్నారని కొద్దికాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి . దీంతో పోలీసులు పార్కుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా , 10కిపైగా జంటలు పట్టుబడినట్లు తెలుస్తోంది . ప్రేమ పేరుతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి , వారిని విడిచి పెట్టారు . ప్రేమికుల దినోత్సవం సమీపిస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉండడంతో పోలీసుశాఖ అప్రమత్తమవుతోంది . శ్రుతిమించి వ్యవహరించిన ప్రేమికులపై చర్యలు తప్పవని హెచ్చరికలు జారీచేసింది