ప్రేమ వేధింపులను భరించలేక పీయూసీ విద్యార్థిని బలవన్మరణానికి ఒడిగట్టిన ఘటన మంగళవారం రాత్రి బెంగుళూరు కేఆర్‌ పురం పరిధిలోని రామ్మూర్తినగర్‌ పొలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. రామ్మూర్తినగర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో పీయూసీ చదువుతుండే అక్షయనగర్‌కు చెందిన లీనా (17)ను అదే కాలేజీలో చదువుతున్న మంజునాథ్‌ అనే విద్యార్థి ప్రేమించాలంటూ చాలాకాలం నుంచి వెంట పడుతూ వేధిస్తున్నాడు. ఆమె ఎన్నిసార్లు తిరస్కరించినా మంజునాథ్‌ వినకపోగా రోజురోజుకు వేధింపులు తీవ్రతరం చేశాడు. ఇటీవల విద్యార్థినిని తన స్నేహితులతో కలసి బెదిరించిన చిత్రాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మంజునాథ్‌ ప్రేమ వేధింపులు తాళలేక మంగళవారం రాత్రి లీనా ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. లీనా తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు రామ్మూర్తినగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితున్ని అరెస్టు చేశారు.