ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాల బస్సు రహదారిపై బీభత్సం సృష్టించింది. డ్రైవర్‌ శివకుమార్‌ అతివేగంగా బస్సును నడిపి ఆటోలు, ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాతపడగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు త్వరలో పెళ్లి కాబోయే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల జంట కూడా ఉండడం విషాదకరం. బస్సు వేగానికి ఓ ద్విచక్ర వాహనం బస్సు కింది భాగంలోకి వెళ్లిపోయింది. బస్సులో ఉన్న విద్యార్థులు, రహదారిపై వెళ్తున్న వాహనచోదకులు, కేకలు వేయగా బస్సును ఆపి డ్రైవర్‌ దిగి పారిపోయాడు.

కొంపల్లిలోని మైసమ్మగూడ నర్సింహారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన ఓ బస్సు జాతీయ రహదారి వైపు వస్తోంది. దారిలో నాగార్జున హోమ్స్‌ వద్ద అదుపు తప్పిన బస్సు అతివేగంగా మూడు ద్విచక్ర వాహనాలను, ఓ ఆటోను ఢీకొంది. ద్విచక్ర వాహనంపై వస్తున్న అరవింద్‌ (24), అనంతలక్ష్మి (23) ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అరవింద్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతిచెందగా, అనంతలక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ద్విచక్రవాహనాలపై వస్తున్న వారిలో తీవ్రంగా గాయపడిన హయత్‌నగర్‌ వాసి ఏసేబు (32) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో మరణించిన అరవింద్‌, అనంతలక్ష్మిలు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరు , కొద్దిరోజుల్లో పెళ్లిచేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. నిజాంపేట శ్రీనివాస్‌నగర్‌ కాలనీలో అరవింద్‌ ఉంటుండగా అనంతలక్ష్మి విజయనగర్‌ కాలనీలో నివసిస్తోంది. పెళ్లయ్యాక ఇద్దరూ ఒకే కంపెనీలో పని చేయాలనుకున్నారు. శనివారం అరవింద్‌ ఇంటికి వచ్చిన ఆమెను తిరిగి ఇంటికి పంపించే క్రమంలో క్యాబ్‌ ఎక్కించేందుకు బైక్‌పై తీసుకువచ్చాడు. నాగార్జున హోమ్‌ వద్దకు రాగానే బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఇద్దరూ రోడ్డుపై పడ్డారు. గాయపడిన వారిని అక్కడున్నవారు ఆసుపత్రికి తరలించగా అరవింద్‌ అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. 45 నిమిషాల తర్వాత అనంతలక్ష్మి ప్రాణాలు విడిచింది.