ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకొని.. అంతలోనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఇన్‌స్పెక్టర్ మన్మోహన్ కథనం ప్రకారం .. మౌలాలి మహాత్మగాంధీనగర్‌లో ఎం.ఉదయ్ భాస్కర్(22) , మణి దంపతులు నివాసం ఉంటున్నారు. ఆరు నెలల క్రితం వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. భాస్కర్ వడ్రంగి పనిచేస్తుండగా, మణి సూపర్ మార్కెట్‌లో పనిచేస్తుంది. కాగా, రాత్రి ఉదయ్ భాస్కర్ హాల్‌లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున మణి గమనించి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. గతంలో మణి తల్లిదండ్రులు ఉదయ్ భాస్కర్‌పై నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్‌లో తమ కూతురిని కిడ్నాప్ చేశాడని కేసు పెట్టారు. ఈ కేసులో ఉదయ్ భాస్కర్ మూడు నెలలు జైలుకు వెళ్లి వచ్చాడు. అనంతరం మణిని యాదగిరిగుట్టలో పెండ్లి చేసుకున్నాడు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని.. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ మన్మోహన్ తెలిపారు.