ఫేస్‌బుక్‌లో వారి మధ్య ప్రేమ మొదలైంది. ఇద్దరూ పోటాపోటీగా ప్రేమించుకున్నారు. ఓ అద్దె ఇళ్లు తీసుకుని ఇద్దరూ కలిసి ఉండటం మొదలుపెట్టారు. అయితే, ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, యువతి ఆ అద్దె ఇంట్లో శవమై కనిపించింది. యువకుడు పత్తా లేడు ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు: కర్ణాటకలోని బెంగళూరు, విజయనగరకు చెందిన 22ఏళ్ల సిరి అనే యువతికి కొన్ని నెలల క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా ఆదర్శ్‌ అనే యువకుడు పరిచయం అయ్యాడు. వీరి పరిచయం కొన్ని రోజులకు స్నేహంగా మారింది. ఆ స్నేహం కాస్తా ప్రేమకు దారి తీసింది ఇద్దరూ కొన్ని నెలలు ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ కలిసి జీవించాలని భావించారు. తమ ఇళ్లలోంచి బయటకు వచ్చేశారు.

హాసన్‌ జిల్లాలోని గుండెనహళ్లి గ్రామానికి చేరుకున్నారు. తమ ఇద్దరికీ పెళ్లయిందని చెప్పి ఓ ఇళ్లు అద్దెకు తీసుకున్నారు. ఆ అద్దె ఇంట్లో కలిసి ఉండేవారు ఇద్దరూ కూడా ఓ పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా, ఆమె గుండెనహళ్లిలోని నివాసంలో శవంగా కనిపించింది. ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సిరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆదర్శ్‌ సంఘటనా స్థలంలో లేకపోవటంతో అతడే సిరిని చంపి, ఇంటి గడియ పెట్టి పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరికీ పెళ్లి అయిందా? లేదా? అన్న దానిపై కూడా క్లారిటీ లేదని పోలీసులు తెలిపారు. ఇద్దరూ సహజీవనం చేస్తూ ఉండి ఉంటారని భావిస్తున్నారు. పరారీలో ఉన్న ఆదర్శ్‌ కోసం అన్వేషిస్తున్నారు.