బంజారాహిల్స్ ర్యాడిసన్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం కలకలం రేపుతోంది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు పోలీస్ ఉన్నతాధికారులు బంజారాహిల్స్ సీఐ శివచంద్రను సస్పెండ్ చేశారు. ఏసీపీ సుదర్శన్‌‌కు చార్జ్‌మెమో జారీ చేశారు. గత కొంతకాలంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పబ్‌లలో విచ్చలవిడిగా డ్రగ్స్ వాడుతున్నారని సమాచారం ఉన్నా, లైట్ తీసుకొని చూసీచూడనట్లు వదిలేశారని పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో పుడింగ్ పబ్‌‌లో విచ్చల విడిగా డ్రగ్స్‌తో పాటు కొకైన్ తీసుకుంటున్నట్లు పక్కా సమాచారం రావడంతో మఫ్టీలో వెళ్లి టాస్క్‌ఫోర్స్ పోలీసులు పబ్‌పై దాడి చేశారు.

పోలీసులను గమనించిన నిందితులు, నిర్వాహకులు ఎక్కడికక్కడే డ్రగ్స్ ప్యాకెట్లను పడేసి పరారయ్యారు. పోలీసుల దాడిలో సుమారు 150 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వారిలో 39 మంది యువతులు ఉన్నారు. వారిలో కొందరు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. పట్టుబడిన వారిలో ప్రముఖ సినీ నటుడి కుమార్తె, ఏపీకి చెందిన ఎంపీ కుమారుడు, మాజీ డీజీపీ కుమార్తె సహా పలువురు ఉన్నారు.

సినీ నటి హేమ హల్‌చల్:

కాగా, బంజారాహిల్స్ పోలీస్ స్టేష్లన్‌లో సినీ నటి హేమ హల్‌చల్ చేశారు. తనకు సంబంధం లేని డ్రగ్స్ కేసులో తాను ఉన్నట్లు పుకార్లు సృష్టించి, తన ప్రతిష్ట దిగజారేలా మీడియాలో కథనాలు రావడంపై మీడియాపై ఆమె చిందులు వేశారు. నేను పబ్‌లో లేకపోయినా నా పేరు ఎందుకు బయటకు తెచ్చారంటూ సూటిగా నిలదీశారు.