సంచలనం సృష్టిస్తోన్న22 నిమిషాల వీడియో, 12పేజీల ఫిర్యాదు, రామాయంపేట్‌లో అధికార టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ తదితరుల వేధింపులు తాళలేక తల్లి కొడుకులు ఆత్మహత్యలకు పాల్పడ్డ ఘటన మరువక ముందే అదే టీఆర్ఎస్ పార్టీ నాయకుల వేధింపులతో మరో మహిళ పోలీసు స్టేషన్ మెట్లెక్కింది. ఓ ఎమ్మెల్యే అనుచరుడి లైంగిక వేధింపులు తాళలేక పోతున్నానని, తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారని, తనకు ఆత్మహత్యనే శరణ్యమని, తన ఫిర్యాదునే మరణ వాంగ్మూలంగా పరిగణిస్తూ తనకు న్యాయం చేయాలంటూ సోమవారం సైబరాబాద్ సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది ఓ మహిళ బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం: కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలో నివసించే బాధితురాలు గతంలో కూకట్ పల్లి వసంతనగర్ ఉంటూ బోటిక్ నడిపేది.

ఆమె ఇంటిపక్కనే ఉన్నవారు ఓ భవన నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలో బాధితురాలి ఇంటి గేట్ ముందు కార్లు నిలపడం, బిల్డింగ్ సామాగ్రి పెట్టడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని తొలగించాలంటూ వేడుకుంది. దీంతో ఆగ్రహించిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన కూకట్ పల్లి కో ఆర్డినేటర్ సతీష్ అరోరా (రెడ్డి సతీష్) కారు డ్రైవర్ తనను నోటికి వచ్చిన బూతులు తిట్టాడని, అలాగే బిల్డింగ్ ఓనర్‌ను కూడా నువ్వెంత నీ బతుకు ఎంత అంటూ అవమానించాడని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

టీఆర్ఎస్ నాయకుడి లైంగిక వేధింపులు:

టీఆర్ఎస్ పార్టీ కూకట్‌పల్లి కో ఆర్డినేటర్ సతీష్ అరోరా (రెడ్డి సతీష్) పలుమార్లు తనను లైంగిక వేధింపులకు గురుచేశాడని, అలాగే తాను ఎక్కడికి వెళితే అక్కడ మనుషులను పెట్టించి అసభ్యంగా మాట్లాడిస్తున్నారని, తన ఫోన్ ను సైతం హ్యాక్ చేసి తన కాల్ రికార్డులు, వాట్సాప్ చాటింగ్, యూ ట్యూబ్, కెమెరా అన్నీ చూస్తున్నారని, తాను వేసుకునే డ్రెస్, ఆభరణాలు, ఇతరత్రా పర్సనల్ వ్యవహారాలు కూడా తనకు పంపుతూ ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులతో, థర్డ్ జెండర్స్ తో బెదిరింపులకు గురిచేస్తున్నారని తెలిపింది. తనతో గడిపితే డబ్బులు సంపాదించుకోవచ్చని, ఒక్కసారైనా తనతో గడపాలని వేధిస్తున్నారంటూ ఆరోపించింది.

పోలీసులు కూడా ఇబ్బందులు పెట్టారు:

టీఆర్ఎస్ నాయకుడు సతీస్ అరోరా వల్ల తనకు ప్రశాంతత కరువైందని, పోలీసులు కూడా తనకు న్యాయం చేయకపోగా ఓ కానిస్టేబుల్, మరో ఎస్సై తన వద్దకు వచ్చి స్టేషన్‌కు రమ్మని బలవంతం చేశారని, లేడి కానిస్టేబుల్ ఏదని అడిగితే ఆమెను పిలిపించి నేరం చేసిందానిలా తనను స్టేషన్ కు తరలించి అక్కడ సాయంత్రం వరకు కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టారని వాపోయింది. ఎస్సై అవమానకరంగా మాట్లాడారని, కేసులు పెడతామంటూ బెదిరించారని, తన ఫోన్ తీసుకుని రెండు రోజుల వరకు ఇవ్వలేదని ఫిర్యాదులో వెల్లడించింది బాధిత మహిళ. తనకు జీవనాధారమైన బోటిక్ ను తీసేయించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే తాను అనేక ఇబ్బందులు పడుతున్నానని, ఆ టీఆర్ఎస్ నాయకుడు సతీష్ అరోరా (రెడ్డి సతీష్)తో తనకు ప్రాణహాని ఉందని, తనను, తమ కుటుంబాన్ని రక్షించాలంటూ పోలీసులను వేడుకుంది. ఒకవేళ తాను చనిపోతే ఈ ఫిర్యాదును మరణ వాంగ్మూలంగా పరిగణించాలని అందులో పేర్కొంది.