బతుకమ్మ వేడుకలు: మధుప్రియ తీరుపై అభ్యంతరం

బతుకమ్మ వేడుకల్లో గాయని మధు ప్రియ తీరుపై ముంబైలోని తెలుగువాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మ సంస్కృతీసంప్రదాయాలను విస్మరించి వేడుకల్లో ఆమె వ్యవహరించారని వారు ఆరోపిస్తున్నారు. ముంబైలో బతుకమ్మ వేడుకల్ని భ్రష్టు పట్టించిన మధుప్రియ.. ఏ ఆట్యిట్యుడ్ రా బాబు.. అంటూ ప్రముఖ రచయిత రవీందర్ సంగివేని ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.

బతుకమ్మ వేడుకల్లో మధుప్రియ స్వోత్కర్ష ఎక్కువగా ఉందని అంటున్నారు. బతుకమ్మ పాటలతో సంప్రదాయబద్దంగా సాగుతున్న వేడుకల్లోకి మధుప్రియ ప్రవేశించి దాని రూపాన్నే మార్చేశారని అంటున్నారు. మందులోడా.. మాయలోడా.. వంటి పాటలతో బతుకమ్మ వేడుకలతో దాండియా ప్రదర్శనగా మార్చేశారని అంటున్నారు. బతుకమ్మతో సంబంధం లేని పాటలతో ఆమె హంగామా చేశారని అంటున్నారు. బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ పాటలే పాడుదామని, బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో వంటి పాటలు పాడుదామని వేదిక మీది నుంచి సంగివేని రవీందర్ చెప్పడంతో ఆమె అలిగినట్లు చెబుతున్నారు.

ఈ విషయాన్ని ప్రస్తావించగా, జానపద కళాకారుల వేషధారణలో మహిళలు బతుకమ్మ అడుతున్నారని, మధుప్రియ వచ్చేసి దాన్ని ఆధునిక దాండియా ప్రదర్శనగా మార్చేశారని, బతుకమ్మ వేడుకలను దాండియా వికృత రూపంగా మార్చవద్దని, అలా మధుప్రియ మార్చినందుకు బాధనిపించిందని రవిందర్ సంగివేని చెప్పారు. భీవండి తెలుగు సంఘం నిర్వహించిన వేడుకల్లో మధుప్రియ పాటలతో ప్రదర్శన ఇచ్చారని, అటువంటి వేడుకల్లో ఏ విధమైన పాటలైనా ఫరవాలేదనిపిస్తాయని, బతుకమ్మ వేడుకలను దాండియా వికృతరూపంగా మార్చడం సరి కాదని ఆయన అన్నారు. అప్పుడు తామేమీ అభ్యంతరం చెప్పలేదని అన్నారు. తాము ఇంటి నుంచి బయటికి వస్తే 20 భాషలు, 20 సంస్కృతులు ఎదురవుతాయని,

ఇటువంటి స్థితిలో తాము తెలుగు సంస్కృతీసంప్రదాయాలను కాపాడుతూ తమ పిల్లలకు వాటి పట్ల అవగాహన పెంచాలని అనుకుంటామని, బతుకమ్మ వంటి వేడుకలు అందుకే నిర్వహిస్తామని, ఇటువంటి స్థితిలో వాటి రూపాలను మార్చేస్తే బాధనిపించిందని ఆయన అన్నారు.