పల్లవి ప్రశాంత్‌, బర్రెలక్క (శిరీష) ఇటీవలి కాలంలో వీరిద్దరి పేర్లు సోషల్‌ మీడియాలో మార్మోగిపోయాయి. ఒకరేమో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి రైతుబిడ్డగా అడుగుపెట్టి సెలబ్రిటీలను వెనక్కు నెట్టి షో విజేతగా నిలిచాడు. కానీ బయటకు వచ్చాక తెలిసీతెలియక చేసిన హంగామాతో జైలుపాలై అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. మరొకరేమో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగి గళాన్ని గట్టిగా వినిపిస్తూ పోటీ చేసింది. అయితే జనాల్లో తిరగడానికంటే కూడా సోషల్‌ మీడియా ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యతిచ్చి ఓటమి చవి చూసింది.

ప్రశాంత్‌, బర్రెలక్క చుట్టాలేం కాదు. కానీ బిగ్‌బాస్‌ 7లో ఒక సామాన్యుడు అడుగుపెట్టాడని తెలిసి సపోర్ట్‌ చేసింది. ఇంకేముంది పలకరిస్తే చాలు తప్పుడు వరుసలు అంటగట్టేసే సమాజం వీరిద్దరికీ ఏదో ఉందని ముడిపెట్టింది, శిరీష పెళ్లి చేసుకోబోతున్నారని నెట్టింట ప్రచారం జరిగింది. కొందరైతే ఓ అడుగు ముందుకేసి వీరి పెళ్లయిపోయినట్లు మార్ఫింగ్‌ ఫోటోలు కూడా వదిలారు.

యూట్యూబ్‌లో పెళ్లి చేశారు:

తాజాగా ఈ వ్యవహారంపై స్పందించింది బర్రెలక్క. ఆమె మాట్లాడుతూ: ‘నేను బిగ్‌బాస్‌ షో అసలు చూడను. అయితే ఏడో సీజన్‌లో ఒక రైతుబిడ్డ వెళ్లాడని తెలిసి రెండు, మూడు ఎపిసోడ్లు చూశాను. ఎమ్మెల్యేగా పోటీ చేసే హడావుడిలో పడి దాన్ని పక్కనపెట్టేశాను. మళ్లీ గ్రాండ్‌ ఫినాలే రోజు చూశాను. ఎప్పుడూ అతడికి ఫోన్‌ చేయలేదు. అలాంటిది నాకు తెలియకుండానే పల్లవి ప్రశాంత్‌ అన్నతో యూట్యూబ్‌లో నా పెళ్లి చేసేశారు. నా పెళ్లికి పెద్ద పెద్ద అతిథులు కూడా వచ్చారట. ఆ సంగతే నాకు తెలీదు.

వ్యూస్‌ కోసం ఇంతలా బరితెగిస్తారా.? ఎవరు మట్టిలో కలిస్తే ఏంటి.? ఎవరి ఇజ్జత్‌ పోతే ఏంటి.? ఎవరి జీవితం నాశనమైతే ఏంటి.? మాకు వ్యూస్‌ కావాలంతే అన్నట్లుగా ఫోటోలు మార్ఫింగ్‌ చేసి మరీ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. చాలా వీడియోలలో నేను పల్లవి ప్రశాంత్‌ను అన్న అని పిలిచాను. ఎవరైనా అన్నను పెళ్లి చేసుకుంటారా.? అతడితో వివాహం జరిగినట్లు ఫేక్‌ ప్రచారం చేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది శిరీష.