హైదరాబాద్: తన కుమారుడు సాయి భగరీథ్ ఎటువంటి తప్పు చేయలేదని తెలంగాణ బిజెపి అధ్యక్షుడ, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ బుధవారం స్పష్టం చేశారు. ఒక విద్యార్థిపై చేయి చేసుకున్నాడన్న ఆరోపణపై భగీరథ్‌పై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేయగా ఈ సంఘటనపై బండి సంజయ్ స్పందిస్తూ తన కుమారుడి చర్యను సమర్తించారు. తన సెల్‌ఫోన్‌లోని నంబర్ తీసుకుని ఒక బాలికను వేధిస్తున్నందుకే ఆ విద్యార్థిపై తన కుమారుడు చేయిచేసుకున్నాడని సంజయ్ వివరించారు. హైదరాబాద్‌లోని యూనివర్సిటీ క్యాంపస్‌లో రెండు నెలల క్రితం ఆ సంఘటన జరిగిందని, తన కుమారుడి బ్యాచ్‌మేట్ ఒకరు ఫోన్‌లో మెసేజ్‌ల ద్వారా ఒక బాలికను వేధించాడని, ఆ వ్యవహారం అప్పుడే పరిష్కారమైందని సంజయ్ తెలిపారు.

తోటి విద్యార్థిని బండి సాయి భగీరథ్ కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై ఒక సీనియర్ పోలీసు అధికారి స్పందిస్తూ కాలేజ్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బండి సంజయ్ కుమారుడు సాయి భగరథ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని, త్వరలోనే భగీరథ్‌కు నోటీసు అందచేస్తామని తెలిపారు. కాగా, సాయి భగీరథ్ నగరంలోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్‌లో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాలేజ్ క్రమశిక్షణ కమిటీ అధిపతి ఇచ్చిన ఫిర్యాదుపై దుండిగల్ పోఈసు స్టేషన్‌లో సాయి భగీరథ్‌పై ఐపిసిలోని 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది.