పదోతరగతి చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్‌ను మలక్‌పేట పోలీసులు అరెస్టు చేశారు.

నగరానికి చెందిన (16) ఏళ్ల బాలిక పదో తరగతి చదువుతోంది. ముసారాంబాగ్‌కు చెందిన కుమార్‌ ఆటోడ్రైవర్‌. ఈనెల 22వ తేదీన బాలిక స్కూల్‌కు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. బాలిక తండ్రి ఇంటి పరిసరాలు, బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో ఆదివారం మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారా బస్తీలో నివాసముంటున్న కుమార్‌పై అనుమానం వ్యక్తం చేయగా అతను కూడా అందుబాటులో లేడు. వివరాలు సేకరించగా దేవరకొండలో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అక్కడికి వెళ్లి చూడగా కుమార్‌ బాలికతో కలిసి ఉన్నట్లు బయటపడింది.

బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు వెల్లడికావడంతో కుమార్‌ను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద సెక్షన్‌ 3, 4 మరియు 376 ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ కేవీ సుబ్బారావు తెలిపారు. అనంతరం కోర్టుకు రిమాండ్‌ చేశారు.