పార్లమెంటు ఎన్నికల్లో తమకు కాంగ్రెస్, బీజేపీతో పోటీ లేదని, టీఆర్ఎస్ కు టీఆర్ఎస్ తోనే మెజారిటీల్లో పోటీ ఉందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ KTR పేర్కొన్నారు. టీఆర్ఎస్ కు మెదక్ పార్లమెంటులో ఎక్కువ మెజారిటీ వస్తుందా కరీంనగర్ లో, వరంగల్ లో ఎక్కువ మెజారిటీ వస్తుందా అనే పోటీ ఉందని, ఇతర పార్టీలు తమకు పోటీనే కాదని ప్రకటించారు. శుక్రవారం మెదక్ లో మెదక్ పార్లమెంటు సమన్వయ సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు.

అంతకుముందు మాట్లాడిన ఎమ్మెల్యే హరీష్ రావు, కరీంనగర్, వరంగల్ ఎంపీ స్థానాల మెజారిటీతో తమ మెదక్ స్థానం మెజారిటీకి పోటీ ఉందని చెప్పారు.

నేరుగా ముఖ్యమంత్రి తోనే సవాల్

అనంతరం మాట్లాడిన కేటీఆర్ హరీష్ సవాల్ ను స్వీకరించి మెదక్ కంటే తమ కరీంనగర్ ఎంపీ స్థానానికి ఎక్కువ మెజారిటీ తెచ్చుకుంటామని ప్రకటించారు. తమ బావాబావమరుదలము బాగానే ఉంటామని, తాను నేరుగా ముఖ్యమంత్రితోనే సవాల్ అంటున్నానని కేటీఆర్ చెప్పారు. బావా బావమరుదుల సవాళ్లతో సభలో నవ్వులు పూసాయి. రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు స్థానాలనూ టీఆర్ఎస్ గెలుచుకుంటే ఢిల్లీలో ఎవరు కూర్చోవాలని నిర్ణయించే శక్తిగా మారుతుందన్నారు. అలా అయితేనే కొట్లాడి నిధులు తెచ్చుకోగలమన్నారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకడం లేదని పేర్కొన్నారు. ఆ పార్టీకి ఓటేస్తే మోరీలో వేసినట్లే అని ప్రజలకు చెప్పాలని శ్రేణులకు సూచించారు. నరేంద్ర మోడీ, అమిత్ షా ఎన్ని మీటింగులు పెట్టినా తెలంగాణలో వారు ఏమీ చేయలేరన్నారు.