హోల్ సేల్ పూల మార్కెట్లో దారుణం, బిర్యానిలో చికెన్ ముక్క విషయమై ఓ యువతి, యువకుడి మధ్య ఘర్షణ తలెత్తగా యువకుడు యువతిని అతి కిరాతకంగా గొంతులో కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. వివరాల్లోకి వెళ్తే దేశం నలుమూలల నుంచి పూలు వచ్చే కోయంబెడు హోల్ సేల్ పూల మార్కెట్లో, ఉదయం నుంచి రాత్రి వరకు పూల అమ్మకాలు జరుగుతుంటాయి. ఎప్పుడు బిజీగా ఉండే ఈ ప్రాంతంలో తాజాగా జరిగిన మర్డర్ మీస్టరిగా మారింది.
ఎక్కడి నుంచి వచ్చారో తెలియని పాతికేళ్ల వయసు గల ఆ జంట బిర్యాని కోసం పోట్లాడి ప్రాణాలు తీసుకుంది. దగ్గరలోని ఓ ఫుట్ పాత్, ఫుడ్ పాయింట్ నుంచి బిర్యాని తీసుకొచ్చిన ఆ జంట మార్కెట్ లోని ఖాళీ ప్రదేశంలో తినడానికి ఉపక్రమించారు. ఆ సమయంలో యువతి బిర్యాని పోట్లంలో చికెన్ ముక్క రాకపోవడంతో యువకుడితో ఆ విషయం చెప్పింది. ఈ విషయమై వారిద్దరి మధ్య చెలరేగిన గొడవలో యువకుడు అతి కిరాతకంగా తనతో పాటు తెచ్చుకున్న కత్తితో యువతి గొంతులో పొడిచేశాడు. దీంతో బాధితురాలు పెద్దగా ఏడవడం విన్నా చుట్టుపక్కల వారు అక్కడికి రావడం గమనించిన యువకుడు పరారయ్యాడు. రక్తపుమడుగులో పడి ఉన్న యువతిని చూసి, వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి వచ్చేసరికి యువతి ప్రాణాలొదిలింది. అయితే, ఆ జంట అనాథ కావడంతో వారెవరో గుర్తుపట్టడం కష్టం మారిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు….