మొదటి భర్తతో కాపురం కలసిరాక విడిపోయిన మహిళ రెండో పెళ్లిని చేసుకుంది, అక్కడ కూడా నిరాదరణే ఎదురు కావడంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. భర్త అక్రమ సంబంధాల మోజులో పడి నిర్లక్ష్యం చేయడంతో భార్య డెత్‌నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. వివరాలు: హెగ్గనహళ్లికి చెందిన పవిత్ర (30) మొదటి భర్తకు గతంలో విడాకులిచ్చింది. ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తున్న పవిత్ర అదే సంస్థ యజమాని చేతన్‌గౌడను ప్రేమించి పెళ్లి చేసుకొంది. అయితే ఇటీవల అతనికి మరో యువతితో సంబంధం ఏర్పడింది. ఈ విషయమై దంపతుల మధ్య గొడవలు జరిగేవి. పిల్లలు కావాలని పవిత్ర భావిస్తే, భర్త ఇందుకు నిరాకరించాడు.

భర్త వివాహేతర సంబంధంపై పవిత్ర ప్రశ్నించగా, నేను మగాడిని, ఏమైనా చేసుకుంటానని ఆమె తల్లి ముందే దాడి చేశాడు. భర్త ప్రవర్తనతో తీవ్ర ఆవేదనకు గురైన పవిత్ర సోమవారం భర్తతో గొడవ పడిన వీడియోను, తాను ఆత్మహత్య చేసుకుంటానని రాసిన డెత్‌నోట్‌ను మొబైల్‌ వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టింది. అది చూసిన ఆమె తల్లి పద్మమ్మ ఇంటికి వచ్చి చూసేసరికి పవిత్ర ఉరి వేసుకుని విగతజీవిగా మారింది. భర్త, అతని ప్రియురాలిపై డెత్‌నోట్‌లో ఆరోపణలు ఉన్నాయి. తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చేతన్‌గౌడ, అతని ప్రియురాలిపై కెంగేరి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.