భర్త కొట్టాడని మనస్తాపానికి లోనైన ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడిన సంఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎల్‌బీనగర్‌ సీఐ అశోక్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా, పులిచర్ల గ్రామం, పెద్దవురె గ్రామానికి చెందిన బొడ్డుపల్లి చంద్రశేఖర్, మంగమ్మ (33) దంపతులు నగరానికి వలసవచ్చి మాన్సూరాబద్‌ డివిజన్‌ శ్రీరామ్‌హిల్స్‌లో నివాసం ఉంటున్నారు.

శనివారం డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన చంద్రశేఖర్‌ పిల్లలు టీవీ చూస్తున్నా పట్టించుకోవడం లేదంటూ భార్య మంగమ్మతో గొడవ పడి ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో మంగమ్మ కోపంతో బెడ్‌ రూమ్‌లోకి వెళ్లిపోగా, పిల్లలతో కలిసి చంద్రశేఖర్‌ మరో గదిలో నిద్రకు ఉపక్రమించాడు. అర్థరాత్రి అతడు బెడ్‌ రూమ్‌ తలుపు తెరిచి చూడగా మంగమ్మ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని కనిపించింది. దీంతో అతను ఆమెను కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది. దీంతో అతను రాగన్నగూడలో ఉంటున్న బావమరిది శ్రీనుకు సమాచారం అందించాడు.

ఆదివారం మృతురాలి తండ్రి భిక్షమయ్య ఫిర్యాదు మేరకు ఎల్‌బీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భర్త వేధింపుల కారణంగానే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని భిక్షమయ్య ఫిర్యాదులో పేర్కొన్నాడు. నిందితుడు చంద్రశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.