సీఐ గారు కన్నుకొట్టి రమ్మన్నాడు.

భర్త వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయిస్తే సీఐ కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దిక్కు తోచని బాధితురాలు రాష్ట్ర మహిళ కమిషన్‌ను ఆశ్రయించింది. వివరాలు. హావేరి జిల్లా రాణిబెన్నూరు తాలూకా బ్యాడగి గ్రామానికి చెందిన సేకవ్వను కొద్ది కాలంగా భర్త మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. వేధింపులు తాళలేక కొద్ది రోజుల క్రితం సేకవ్వ బ్యాడగి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది.
CI చిదానంద బాధితురాలి పరిస్థితిని ఆసరాగా తీసుకొని లైంగికంగా వేధించసాగాడు. గురువారం కూడా సేకవ్వను స్టేషన్‌కు పిలిపించుకొని వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. సీఐ ప్రవర్తనతో విసిగిపోయిన సేకవ్వ విషయాన్ని బంధువులకు తెలియజేయగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. సీఐ చిదానంద తహసీల్దార్‌ కార్యాలయంలో ఉన్నట్లు తెలుకొని అక్కడికి వెళ్లారు. సీఐతో ఘర్షణ పడడంతో యూనిఫాం కొద్దిగా చిరిగింది.

అనంతరం భర్తతో పాటు సీఐ చిదానందపై కూడా బ్యాడగి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితురాలు.. శుక్రవారం బెంగళూరులోని మహిళా కమిషన్‌ కార్యాలయానికి చేరుకొని ఇరువురిపై ఫిర్యాదు చేశారు.