కోట మండలం చిట్టేడుకు చెందిన గెడి నిరూప(28) 2016లో అదే గ్రామానికి చెందిన కొమ్మ రాజశేఖర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నాయుడుపేటలో కాపురముంటుండగా 2018లో ఆమె తండ్రి రామయ్య తన అల్లుడు రాజశేఖర్‌ను హత్య చేశాడు. అప్పటి నుంచి తన బిడ్డ ప్రీతితో కలిసి నిరూప తన అత్తమామల దగ్గరకు వచ్చేసింది. ఇటీవల శ్రీసిటీలో ఆమెకు ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలో డక్కిలి మండలానికి చెందిన పరశురామ్‌తో పరిచయం ఏర్పడింది. తర్వాత అతనితో కలిసి పూడి గ్రామంలో సహజీవనం చేస్తోంది.

శనివారం రాత్రి ఇంటికి వచ్చిన నిరూప తన నాలుగేళ్ల కుమార్తెకు బిస్కెట్లు పెట్టి అనంతరం చీరతో ఉరేసుకుంది. ఈ విషయం గమనించిన చిన్నారి ఏడుస్తూ ఉండడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే నిరూప మృతి చెందింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిరూప మృతదేహం తీసుకువెళ్లేందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో పోలీసులే అంత్యక్రియలు పూర్తి చేశారు. చిన్నారి ప్రీతిని తాత ఆదినారాయణకు అప్పగించారు.