ఓ గ్రామంలో సర్పంచ్‌గా ఎస్సీ మహిళలకు కేటాయించారు. దీంతో ఒకతను తన భార్యను సర్పంచ్‌గా నిలబడాలని, పుట్టింటినుంచి రూ. 5 లక్షలు తీసుకురావాలని వేధింపులకు గురిచేశాడు. భర్త వేధింపులకు తాళలేని ఆమె ఆత్యహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన డిండి మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది.
నిజాంనగర్ మండలం ఎర్రగుంటపల్లికి చెందిన జంతుక లింగమయ్య, అదే మండలానికి చెందిన భైరాపురం మీనయ్య-శారద దంపతుల కుమార్తె రాధ(22)ను ఎనిమిది నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో ఇవ్వాల్సిన ద్విచక్ర వాహనం గురించి లింగమయ్య, రాధను నిత్యం వేధిస్తూనే వున్నాడు. ఇంతలో గ్రామ పంచాయితీ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చింది. దీంతో తన భార్యను ఎస్సీ మహిళా కోటాలో సర్పంచ్ పదవికై బరిలోకి దింపాలనుకున్నాడు.
సర్పంచిగా పోటీ చేయాలంటూ రాధపై ఒత్తిడి తీసుకొచ్చాడు లింగమయ్య. ఎన్నికల్లో ఖర్చు చేయడానికి రూ.5 లక్షలు ఆమె పుట్టింటి నుంచి తీసుకురావాలని వేధించడం మొదలుపెట్టాడు. కాగా, ఆమె ఈ నెల 6న నిజాంనగర్‌లో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వేధింపుల విషయాన్ని వివరించింది. తల్లిదండ్రులు ఏదో సర్దిచెప్పారు. ఈ క్రమంలో బుధవారం పుట్టింట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది రాధ. అపస్మారక స్థితిలో వున్న ఆమెను వెంటనే కుటుంబ సభ్యులు దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడినుంచి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు