Advertisement

మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌కు ఉరి శిక్ష పడి ఉంటే బాగుండేదని సూరి సతీమణి గంగుల భానుమతి అన్నారు. సూరి హత్య కేసులో నాంపల్లి కోర్టు ఈరోజు భానుకిరణ్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తూ తుది తీర్పు వెల్లడించిన నేపథ్యంలో ఆమె స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ,

సూరి పక్కనే నమ్మకంగా ఉంటూ భానుకిరణ్‌ ఇలా చేస్తాడని తాము అనుకోలేదన్నారు. ఏడేళ్ల తరువాత తీర్పు వచ్చిందన్నారు. భానుకిరణ్‌కు యావజ్జీవ శిక్ష పడిందని. దీంతో అతడికి జీవితం విలువ ఏంటో తెలుస్తుందన్నారు. కేవలం డబ్బు, ఆస్తుల కోసమే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా బతుకుదామనుకుంటున్న తరుణంలో భానుకిరణ్‌ హత్య చేశాడని చెప్పారు. తన భర్త హత్యకేసులో నిందితులకు శిక్ష వేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తున్నానని చెప్పారు.

అయితే, భానుకిరణ్‌కు ఉరిశిక్ష పడి ఉంటే సూరి ఆత్మకు శాంతి చేకూరేదని ఆమె అభిప్రాయపడ్డారు.