పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రస్థావరాలపై అర్ధరాత్రి మెరుపుదాడులు చేసింది. 12 మిరేజ్ 2000 ఫైటర్ జెట్లతో సుమారు వెయ్యి కిలోల బాంబులను జైషే మహ్మద్ తీవ్రవాద స్థావరాలపై వేసింది. అర్ధరాత్రి సమయంలో ఏం జరుగుతోందోనని ఉగ్రవాదులు మేల్కొనేలోపే మన పైలెట్లు పనికానిచ్చేశారు. పాక్ ఆర్మీ తేరుకునేలోపే భారత వాయుసేన టార్గెట్ పూర్తి చేసింది. భారత్ ప్రతీకార దాడిలో పీవోకేలో ఉన్న అతిపెద్ద జైషే ఉగ్ర శిబిరం పూర్తిగా ధ్వంసం అయిందని చెబుతున్నారు. అంతే కాకుండా బాలాకోట్, చకోటి, ముజఫరబాద్‌లోని 3 ఉగ్రశిబిరాలు కూడా నేలమట్టం అయ్యాయని, భారత్ జరిపిన ఈ సర్జికల్ స్ట్రైక్-2లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారని అంచనా వేస్తున్నారు. కార్గిల్ యుద్ధం తర్వాత ఈ తరహాల వైమానికి దాడులు చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

భారత వాయుసేన జరిపిన ప్రతీకార దాడిపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహిస్తున్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తదితర ముఖ్యులతో సమావేశం అయ్యారు. ఉగ్రవాదులపై ప్రతీకారదాడిలో పాల్గొన్న ఐఏఎఫ్ పైలెట్లకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సెల్యూట్ చేశారు.