కరాచీ: సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా భారతీయ పాటలకు నృత్యాలు చేయడం, స్కూల్‌లో భారత జెండాను రెపరెపలా డించినందుకు గానూ పాకిస్థాన్‌లో ఓ పాఠశాల రిజిస్ట్రేషన్‌ను అక్కడి అధికారులు రద్దు చేశారు. గతవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కరాచీలోని మామా బేబీకేర్‌ కేంబ్రిడ్జ్‌ స్కూల్‌లో ఇటీవల సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కొందరు చిన్నారులు త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ భారతీయ పాటకు నృత్యం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో ఇది కాస్తా అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో సింధ్‌ ప్రైవేట్‌ సంస్థల రిజిస్ట్రేషన్‌, తనిఖీల డైరెక్టరేట్‌ అధికారులు ఓ కమిటీని ఏర్పాటుచేసి దర్యాప్తు చేపట్టారు. సదరు స్కూల్‌ ఉద్దేశపూర్వకంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో తేలడంతో పాఠశాల యజమానికి అధికారులు నోటీసులు జారీచేశారు. మూడు రోజుల్లోగా డైరెక్టరేట్‌ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని, లేదంటే స్కూల్‌ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇచ్చిన గడువు లోగా పాఠశాల యజమాని డైరెక్టరేట్‌ ఎదుట హాజరుకాకపోవడంతో శనివారం స్కూల్‌ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేశారు.