ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన దాడులు జరిపిన కొన్ని గంటల్లోనే పాక్‌కు చెందిన ఓ డ్రోన్‌ భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్లు సమాచారం. వెంటనే గుర్తించిన భారత బలగాలు మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో దాన్ని పేల్చివేశారు. గుజరాత్‌లోని కచ్‌ అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న నలియా ఎయిర్‌ బేస్‌ సమీపంలో గుర్తించిన దీన్ని అక్కడి సిబ్బంది వెంటనే పేల్చివేశారు.

ఈ ఎయిర్‌ బేస్ సరిహద్దు అతి సమీపంలో ఉంటుంది. ఇప్పటికే దాడుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలైన జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌లలో హైఅలర్ట్‌ ప్రకటించగా గుజరాత్‌లోనూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాయుసేన హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించినా వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.

ఇలా ఉండగా, వాస్తవ ఆధీన రేఖను దాటి భారత వాయుసేన పాక్‌ ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసిన ఆపరేషన్ మొత్తం 21 నిముషాలలోనే ముగిసిన్నట్లు తెలుస్తున్నది. ఇందుకు అత్యాధునిక మిరాజ్‌ 2000 ఫైటర్‌ జెట్లను వినియోగించింది. మొత్తం మూడు ప్రాంతాల్లో ఇవి తమకు అప్పగించిన పనిని చాకచక్యంగా పూర్తి చేశాయి. దాడి మొత్తం 21 నిమిషాల్లోనే పూర్తయింది. వెయ్యి కిలోల పేలుడు పదార్థాలు ఉన్న లేజర్‌ గైడెడ్‌ బాంబులతో ఉగ్రక్యాంపులపై యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి.

మొదటి దాడి మంగళవారం తెల్లవారుజామున 3.45 నిమిషాలకు ప్రారంభమైంది. పీఓకే రాజధాని‌ అయిన ముజఫరాబాద్‌కు 24 కిమీ దూరంలో బాలకోట్‌ ప్రాంతంపై 3.45 నుంచి 3.53 వరకూ బాంబుల వర్షం కురిపించింది. బాలకోట్‌ పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ప్రాంతం.

బాలాకోట్‌లోని జైషే మహమ్మద్‌, లష్కరే, హిజ్బుల్‌ ఉగ్రవాద సంస్థల సంయక్త శిక్షణా శిబిరాల లక్ష్యంగా భారత్‌ ఈ దాడులు చేపట్టింది. మరో లక్ష్యం ముజఫరాబాద్‌ ప్రాంతంపై యుద్ధ విమానాలు 3.48 నిమిషాల నుంచి 3.55 మధ్య దాడులు చేపట్టాయి. చకోటి ప్రాంతంపై 3.58 నుంచి 4.04 వరకూ జెట్‌ ఫైటర్స్‌ బాంబుల వర్షం కురిపించాయి.

ఇలా ఉండగా, పాకిస్థానీ ఎఫ్‌ 16 విమానాలు ప్రతిదాడికి దిగినప్పటికీ.. మిరాజ్‌ 2000 విమానాలను ఎదుర్కోలేక వెనక్కి వెళ్లిపోయినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. భారత్‌వైపు వచ్చి దాడులు జరిపేందుకు యత్నించిన పాక్‌ యత్నాలను ఎయిర్‌ఫోర్స్‌ తిప్పికొట్టింది. భారత్‌ సామర్థ్యం, సంసిద్ధత చూసి పాక్‌ వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తున్నది.