భార్య గొడవ పడిందని ఓ యువకుడు మద్యంమత్తులో ఏకంగా రైలును అడ్డగించాడు. ఈ ఘటన శివగంగై జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మానామదురై సమీపంలోని ఏనాది చెంగోట్టైకు చెందిన షణ్ముగవేల్‌ (26) శుక్రవారం భార్యతో గోడవపడి తన బైక్ పై తిరుభువనం చేరుకున్నాడు. అక్కడి లాడనేందల్‌ రైల్వే వంతెన కింద మద్యం తాగి నిద్రించాడు. శనివారం ఉదయం బైకును తీసుకెళ్లి అక్కడి రైలు పట్టాలపై నిలిపి దానిపైనే కూర్చున్నాడు. ఉదయం 7.40 గంటలకు మదురై నుంచి రామేశ్వరం వెళ్లే రైలు అటుగా వచ్చింది. కొద్ది దూరంలోనే పట్టాలపై బైక్‌ సహా వ్యక్తి ఉండటాన్ని గమనించిన డ్రైవరు అప్రమత్తమై రైలును నిలిపివేశాడు. అందులోని ప్రయాణికులు కిందికి దిగి విషయం తెలుసుకున్నారు. షణ్ముగవేల్‌కు నచ్చచెప్పడానికి ఎంత ప్రయత్నించినా అతడు మాట వినలేదు. దీంతో రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే షణ్ముగవేల్‌ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనతో సుమారు అరగంట ఆలస్యంగా రైలు నడిచింది. మానామదురై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని షణ్ముగవేల్‌ కోసం గాలిస్తున్నారు.