తన భార్యకు దూరంగా ఉండాలని చెబుతున్నా వినకుండా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న యువకుడిని దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. స్థానికంగా కలకలం క్రియేట్ చేసిన ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా ఆత్మకూర్‌లో వెలుగుచూసింది. ఆత్మకూర్ మండలంలోని ఏవూరు గ్రామానికి చెందిన 23 ఏళ్ల వంశీ… ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. అదే గ్రామానికి చెందిన చంద్రమోషన్ భార్య, అప్పుడప్పుడూ తన ఆటోకి ఎక్కేది. ఇలా వారి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. తన భార్యతో సన్నిహితంగా ఉంటున్న వంశీని పద్ధతి మార్చుకొమ్మని చాలాసార్లు హెచ్చరించాడు చంద్రమోహన్. అయితే వంశీ పద్ధతిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. చంద్రమోహన్ భార్యతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చాడు వంశీ. దాంతో వంశీని చంపేయాలని ఫిక్స్ అయ్యాడు చంద్రమోహన్. శుక్రవారం రాత్రి తన ఇంట్లో నిద్రిపోతున్న సమయంలో వంశీపై దాడి చేశాడు చంద్రమోహన్. కత్తి తీసుకుని విచక్షణారహితంగా వంశీ తల, హృదయ భాగంపై దాడి చేసి పొడిచి చంపేశాడు.

Advertisement

వంశీ అరుపులు విన్న అతని తల్లి… చంద్రమోహన్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆమెపై కూడా కత్తితో దాడి చేసిన చంద్రమోహన్… చుట్టుపక్కల వాళ్లు రావడాన్ని గమనించి అక్కడి నుంచి పారిపోయాడు. చంద్రమోహన్ దాడిలో తీవ్రంగా గాయపడిన వంశీని, అతని తల్లి ప్రమీలను వెంటనే సూర్యాపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అయితే వంశీ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు వైద్యులు. భాగ్యనగరంలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు వంశీ. అతని తల్లి ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు… చంద్రమోహన్‌ను అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.