భార్య లేచిపోయిందని బిడ్డలను చంపేశాడు

ఇదోరకం ఉన్మాదం. వైద్య శాస్త్రానికి అందని జబ్బు . అదే కిరాతకం , రాక్షసత్వం. బిడ్డలనుకూడా చంపే నీచత్వం వాళ్ళ నరనరాల్లో ఉంటుంది, ఇటువంటి వాళ్లకు మరణంతోనే ఆ దుర్మార్గం పోతుంది.

జూపాడుబంగ్లాలో దారుణం చోటుచేసుకుంది. మండల కేంద్రంలో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లల గొంతు కోసి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. జూపాడు బంగ్లా గ్రామానికి చెందిన భానోజీరావుకి ఝాన్సీలక్ష్మీబాయితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి లిఖిత(7), మధు(4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం ఝాన్సీ భర్త, పిల్లలను వదిలేసి వేరొక వ్యక్తితో వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన భానూజీరావు సోమవారం తెల్లవారుజామున బ్లేడ్‌తో చిన్నారులను గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం ఇంట్లోనే తాడుతో ఉరేసుకున్నాడు. అయితే తాడు తెగిపోవడంతో కింద పడిపోయాడు. దీంతో వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పి లొంగిపోయాడు.

ఈ మేరకు ఎస్సై అశోక్‌ కుమార్‌, సీఐ మధుసూదన్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.