తహసీల్దారు తీరుపై వృద్ధ దంపతుల వినూత్న నిరసన
తహసీల్దారుకు లంచం ఇచ్చేందుకు సాయం చేయాలంటూ ఇద్దరు వృద్ధ దంపతులు బిచ్చమెత్తిన ఘటన ఇది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం ఆజంనగర్‌కు చెందిన మాంత బసవయ్య, లక్ష్మి అనే వృద్ధ దంపతులు తమ పట్టా భూములకు పాసు పుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దారు లంచం అడుగుతున్నారని శుక్రవారం జిల్లా కేంద్రంలో భిక్షాటన చేశారు. ఈ విషయం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించగా, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తక్షణం స్పందించి ఆర్డీవో ద్వారా సమస్య పరిష్కరించారు. ఈ వృద్ధ దంపతులు తమ 9 ఎకరాల భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని రెండేళ్లుగా తిరుగుతున్నారు. రెండు నెలల క్రితం తహసీల్దారు కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపారు. ఇటీవల జేసీ స్వర్ణలత తహసీల్దారును ఆదేశించినా ఫలితం లేకపోయింది.
చివరగా తహసీల్దారుకు లంచం ఇస్తేనే పాసు పుస్తకం జారీ చేస్తారనే ఉద్దేశంతో భిక్షాటనకు దిగారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వారిని భూపాలపల్లి ఆర్డీవో వెంకటాచారి తన కార్యాలయానికి పిలిపించి 4.10 ఎకరాలకు పట్టాదారు పాసుపుస్తకాన్ని జారీ చేశారు. మిగతా 5.07 ఎకరాల భూములు వివాదంలో ఉన్నందున పూర్తిగా పరిశీలించి పట్టాదారు పాసు పుస్తకం జారీ చేస్తామని ఆర్డీవో వెల్లడించారు.