ఫేస్ బుక్‌లో పరిచయమైన ఓ మంత్రగాడు తనను అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తొమ్మిది నెలల క్రితం తనను అత్యాచారం చేశాడంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. తూర్పు ఢిల్లీలోని షాదారా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఓ 45 ఏళ్ల మహిళకు 28 ఏళ్ల యువకుడు ఫేస్ బుక్‌లో పరిచయం అయ్యాడు. తనను తాను మంత్రగాడినని పరిచయం చేసుకున్నాడు. దీంతో తన కుటుంబసమస్యలను ఆమె అతనితో పంచుకుంది.

తన మంత్రశక్తితో ఆమె ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తీరుస్తానని చెప్పాడు. కొన్ని రోజుల పాటు ఇంటికి వచ్చి ఆమె భర్తతో పరిచయం పెంచుకున్నాడు. ఓ రోజు భర్త లేని సమయంలో ఇంటికి వచ్చి తనపై అత్యాచారం చేశాడని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి అతడు కనిపించడం లేదని ఆరోపించింది. తమ ఇంటికి వచ్చిన రెండో సారి అతడు తనపై అత్యాచారం చేశాడని పోలీసుకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇలాంటి ఘటన గతంలో కూడా ఒకటి జరిగింది. ఫేస్ బుక్‌లో పరిచయమైన ఓ వ్యక్తికి 69 ఏళ్ల మహిళ రూ.8 లక్షలు సమర్పించుకుంది. ఫేస్ బుక్‌లో పరిచయమైన ఆ వ్యక్తి ఆమెతో మంచిగా మాట్లాడాడు. ఓ రోజు ఆమె ఇంటికి డిన్నర్‌కు వెళ్లాడు. ఆమె ఇంటికి కన్నం వేశాడు. ఇంట్లో ఉన్న రూ.8లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకున్నాడు.