డ్యాన్స్ బార్లకు ఊరట కలిగించే తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. డ్యాన్స్ బార్లపై మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలను కొట్టేసింది. బార్లలో మందు, చిందు కలిసి నడవచ్చని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని డ్యాన్స్ బార్లు ప్రార్థనాలయాలు, విద్యాసంస్థలకు కనీసం కిలోమీటరు దూరంలో ఉండాలన్న నిబంధనను కూడా కోర్టు తోసిపుచ్చింది.

ముంబైలో ఇది కుదరదని, దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని కోర్టు అభిప్రాయపడింది. ఇక బార్లలో డ్యాన్స్ చేసే వారికి టిప్స్ ఇవ్వాలి తప్ప||వాళ్లపై డబ్బు వెదజల్లకూడదని కోర్టు తేల్చి చెప్పింది. ప్రార్థనాలయాలు, విద్యాసంస్థలకు కిలో మీటర్ దూరంలో బార్లు ఏర్పాటు చేయాలన్న నిబంధనను సవాలు చేస్తూ ఈ బార్ల యజమానులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. పెద్ద పెద్ద నగరాల్లో ఇది కుదరదని వాళ్లు వాదించారు. 2016లో ఈ డ్యాన్స్ బార్లపై కఠిన నిబంధనలు విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చింది.

డ్యాన్స్ చేసే ప్రదేశాల్లో మద్యం సరఫరా ఉండకూడదని, బార్లు రాత్రి 11.30 గంటలకల్లా మూసివేయాలన్న నిబంధనలు ఇందులో ఉన్నాయి. నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు కూడా విధించాలని ఈ చట్టంలో చేర్చారు.