ఇద్దరి ఇంట్లోవాళ్లు శాఖాహారులే. ఎప్పుడు బయటకు వెళ్లినా ఆమె ఫుల్లుగా నాన్‌వెజ్ లాగించేది. తనలా తన భర్తను కూడా మాంసాహారం తినమని బలవంతం చేయడం మొదలుపెట్టింది. అలా నాలుగు నెలలపాటు మటన్ తినమని అతని వెంట జోరీగలా పడింది. అతను తిననని తెగేసి చెప్పాడు. దీంతో ఆమెకు భర్తపై చిర్రెత్తుకొచ్చింది. ప్రేమించుకునేటప్పుడు ప్రియురాలికోసం ఏం చెయ్యడానికైనా వెనకాడని మగాళ్లు పెళ్లయ్యాక భర్యకోసం ఈ మాత్రం చెయ్యలేరా అని భావించిందామె. తన మాటను లెక్కచేయడంలేదని మనస్థాపానికి గురైంది. ‘నా కోసం మటన్ తినని భర్త నాకొద్దు’ అంటూ భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లింది. వెళ్లిన భార్యను పట్టించుకోలేదు సదరు భర్త , దీంతో మరింత కోపాన్ని పెంచుకుంది భర్తమీద. భర్త తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి అసలు నిజం తెలిసి అవాక్కయ్యారు. మటన్ కోసం భర్తను వదిలించుకుంటున్న ఆమెను చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.ఇద్దరికీ ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇప్పించారు. నీసు వాసన పడని భర్తను మటన్ తినమని బలవంత పెట్టడం సరికాదని పోలీసులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆమె వాళ్ల మాటలు పట్టించుకోకుండా,

తనకోసం ఆమాత్రం చేయలేడా? అని వితండవాదం చేయసాగింది. మాంసాహారం అంటే ఇష్టముంటే ఇంట్లో ప్రత్యేకంగా వండుకుని తినాలని, భర్తను అలవాట్లు మార్చుకోవాలంటూ ఒత్తిడి చేయడం సరికాదంటూ ఆమెకు సలహాలు ఇచ్చారు. చివరికి ఇద్దరినీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌కు పంపించారు. చిన్న చిన్నకారణాలతో కాపురాలు కూల్చుకోవద్దని పోలీసులు వారిమధ్య సయోధ్య కుదుర్చటానికి ప్రయత్నిస్తున్నారు.