ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. పురుగుల మందు తాగి ప్రాణం తీసుకోవాలనుకున్నాడు. అయితే, తనకు ఇష్టమైన మద్యంలో కలుపుకొని తాగుదామని అనుకున్నాడు. దీంతో మద్యం తీసుకొచ్చి అందులో పురుగుల మందు కలిపాడు. ఇక తాగేద్దాం అనుకున్న సమయంలో అతడి స్నేహితుడు కూడా వచ్చాడు. మద్యం తనకు కూడా ఇవ్వాలని కోరాడు. అయితే, అందుకు స్నేహితుడు నిరాకరించాడు.

Advertisement

ఇందులో పురుగుల మందు కలిపానని, తాగితే చస్తావని వార్నింగ్ ఇచ్చాడు. అయితే, మద్యం ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతో ఇలా వంకలు చెబుతున్నాడనుకున్న ఆ స్నేహితుడు వద్దన్నా వినకుండా గటగటా మందు తాగేశాడు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మొదట చనిపోవాలనుకున్న వ్యక్తి చనిపోయాడు. బలవంతంగా మద్యం తీసుకుని తాగిన వ్యక్తి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.

తుళ్లూరు మండలం వెంకటపాలేనికి చెందిన పులి హరిబాబు (35) అనే వ్యక్తి ఈ రోజు ఉదయం తన ఇంట్లో డబ్బులు కావాలని అడిగాడు. అందుకు ఇంట్లో వారు నిరాకరించారు. దీంతో కోపం వచ్చిన హరిబాబు చనిపోవాలనుకుని మద్యం తెచ్చుకుని అందులో పురుగుల మందు తాగాడు. అతడు మద్యం తాగే సమయంలో అటుగా వచ్చిన దాసరి వందనం (65) లాక్కుని మద్యం తాగేశాడు. ఇద్దరూ పురుగుల మందు తాగిన మద్యం సేవించారు. వారిలో హరిబాబు ప్రాణాలు కోల్పోయాడు. దాసరి వందనను విజయవాడ ఆస్పత్రికి తరలించారు. హరిబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.