భర్త చేయి పట్టుకుని నిండు నూరేళ్లు జీవించాల్సిన ఓ నవ వధువు, మనసుకు నచ్చని మనువు చేశారని బలవన్మరణానికి పాల్పడి తనువు చాలించింది.

గంపనపల్లెకు చెందిన పునీశ్వర్‌ కుమార్తె టి.సరస్వతి (19) పెద్దపంజాణి మండలం లింగంరెడ్డిపల్లెకు చెందిన తన మామ జగదీష్‌కు ఇచ్చి మూడు రోజుల క్రితం వివాహం చేశారు. అయితే సరస్వతికి ఆ వివాహం ఇష్టం లేదు. అయినా పెద్దలు వివాహం చేశారు. సరస్వతి భర్త జగదీష్‌తో శుక్రవారం పుట్టింటికి వచ్చింది.

రాత్రి 8 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగా సరస్వతి బాత్‌రూంలోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పటించుకుంది. మంటల్లో చిక్కుకున్న సరస్వతి గట్టిగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు మంటలను అదుపు చేసి, చికిత్సల నిమిత్తం పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రూయాకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది. ఈ మేరకు ఎస్‌ఐ శివశంకర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్‌ వరకు చదువుకున్న సరస్వతి ఇష్టం లేని వివాహం చేయడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు.