పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన CRPF‌ జవాన్‌ అజిత్‌ కుమార్‌ అంతిమ యాత్ర సందర్భంగా, బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌ వ్యవహార శైలి వివాదాస్పదమైంది. ఉగ్రవాదుల దాడిలో నేల’కొరిగిన అజిత్‌ కుమార్‌కు కడసారి నివాళులు అర్పించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు, ఉన్నావ్‌కు తరలిరాగా జవాన్‌ భౌతికకాయం ఉంచిన వాహనంపై స్ధానిక ఎంపీ సాక్షి మహరాజ్‌ వారందరికీ నవ్వుతూ అభివాదం తెలపడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన తీరును సోషల్‌ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా ఎండగట్టారు.

కాగా, జవాన్‌ అంతిమయాత్రలో సాక్షి మహరాజ్‌ అభ్యంతరకర ప్రవర్తనతో కూడిన వీడియో, ఫోటోలను మరికొందరు పోస్ట్‌ చేశారు. బీజేపీ ఎంపీ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ ఎంపీ తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ట్వీట్‌ చేశారు. సాక్షి మహరాజ్‌ జవాన్‌ అంతిమ యాత్రను అభినందన యాత్రగా ఫీలవుతున్నారు అని ఓ నెటిజన్‌ వ్యంగ్యాస్త్ర సంధించగా, బీజేపీ ఎంపీ చర్య సిగ్గుచేటని మరో యూజర్‌ మండిపడ్డారు.