రన్నింగ్‌లో రైలులో దారుణం జరిగింది. ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ మహిళ(30)పై కన్నేసిన కొందరు మృగాలు రెచ్చిపోయారు. ఆమెపై లైంగిక దాడి ప్రయత్నం చేయగా ప్రతిఘటించడంతో నడుస్తున్న రైలులో నుంచి బయటకు తోసేశారు. దీంతో ఆమె మృతి చెందింది. ఈ షాకింగ్‌ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం: బాధితురాలు తన కొడుకు(9)తో కలిసి ఫతేబాద్‌ జిల్లాలోని రోహతక్‌ నుంచి రైలుతో తోహానాకు వస్తోంది. ఈ క్రమంలో ఆమె ఒంటరిగా ఉన్న విషయాన్ని కొందరు వ్యక్తులు గుర్తించారు. ఆమెపై కన్నేసి లైంగిక దాడియత్నం చేశారు. దీంతో, బాధితురాలు వారిని ప్రతిఘటించింది. ఈ నేపథ్యంలో ఆగ్రహంతో నిందుతులు ఆమెను నడుస్తున్న రైలులో నుంచి బయటకు తోసేశారు. అనంతరం, వారు కూడా రైలులో నుంచి బయటకు దూకేశారు.

కాగా, రైలు తోహానా స్టేషన్‌కు చేరుకోగానే ఏడుస్తున్న తన కొడుకును చూసి బాధితురాలి భర్త ఆందోళనకు గురయ్యాడు. తల్లి ఎక్కడ అని అడగడంతో జరిగిన విషయాన్ని అతనికి తెలిపాడు. దీంతో.. ఆమె భర్త వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో “తాను(బాధితురాలు) స్టేషన్‌కు 20 కి.మీ దూరంలో ఉన్నపుడు తన మొబైల్‌కి కాల్ చేసింది. స్టేషన్‌కి వచ్చి పికప్ చేసుకోవాలని కోరినట్టు పోలీసులకు వివరించాడు. దీంతో, రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు, సివిల్‌ పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యులు ఆమె కోసం రైల్వే ట్రాక్‌ వెంట వెతికారు. ఈ క్రమంలో ట్రాక్‌ పక్కన పొదల్లో ఆమె డెడ్‌బాడీని గుర్తించారు. కాగా, మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించిన వారిలో ఒక నిందితుడిగా సందీప్ (27)ను గుర్తించి అరెస్ట్‌ చేసినట్టు ఫతేబాద్ పోలీసు చీఫ్ అస్తా మోదీ తెలిపారు. కాగా, బాధితురాల ప్రయాణిస్తున్న సమయంలో రైలు కోచ్‌లో ముగ్గురు మాత్రమే ఉన్నారని ఆ సమయంలో ఇలా జరిగిందని స్పష్టం చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.