తెలంగాణలో మరో పరువు హత్య!

తెలంగాణలో మరో ‘పరువు హత్య’ కలకలం రేపింది. కరీంనగర్‌ జిల్లాలోని శంకరపట్నం మండలం తాడికల్‌లో గడ్డి కుమార్‌ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతడి మరణానికి ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుమార్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ప్రేమ విషయంలో అమ్మాయి కుటుంబ సభ్యులు కుమార్‌తో గొడవపడ్డట్లు తెలుస్తుంది. యువతిని మర్చిపోవాలని లేదంటే చంపేస్తామని యువకుడిని చాలా సార్లు హెచ్చరించారు. అయినప్పటికీ ఆ యువతితో కుమార్ ప్రేమను కొనసాగించాడు.

ఈ క్రమంలో గత రాత్రి తాడికల్ శివారులో కుమార్ శవమై కనిపించాడు. అమ్మాయి బంధువులే కుమార్‌ని హత్య చేశారని యువకుడి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. యువతి బంధువులు బెరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. అక్కడికి వచ్చిన పోలీసులపై తిరగబడి పోలీసు వాహనంపై రాళ్లు రువ్వారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులను భారీగా మొహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

విచారణ జరిపి చర్యలు చేపడతామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది.