హైదరాబాద్‌లో మహిళ లోకో పైలట్ మిస్సింగ్ కలకలం రేపుతోంది. గతేడాది నవంబర్ 30 నుంచి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌సో అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న లోకో పైలట్ వాసవి ప్రభ కనిపించ కుండా పోయింది. సనత్‌నగర్‌లో వాసవి కుటుంబం నివాసం ఉంటుండగా ఆమెకు సంచిత్ సాయి అనే వ్యక్తితో వివాహం కుదిరింది. డిసెంబర్ 11న పెళ్లి ముహుర్తం ఖరారు చేశారు. పెళ్లి షాపింగ్ కూడా పూర్తి చేసిన కుటుంబ సభ్యులు వివాహం చేసేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. డిసంబర్ 5 నుంచి ఆమె తన పెళ్లి కోసం సెలవులు కూడా పెట్టింది. ఇంతలోనే గతేడాది నవంబర్ 30న ఇంటి నుంచి బయటకు వెళ్లిన వాసవి కనిపించకుండా పోవటం కలకలం రేపుతోంది. వాసవి తన సెల్‌ఫోన్, ఐడీ కార్డ్, గ్యాడ్జెట్స్, ఏటీఎం కార్డ్స్ , ఆధార్ కార్డ్ అన్ని ఇంట్లోనే పెట్టి కనిపించకుండా పోయింది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సనత్ నగర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

పెళ్లి చేసుకోబోయే సంచిత్ సాయితో వాసవి గొడవ పడినట్లుగా ఆమె తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఎక్కడ ఉన్నా క్షేమంగా ఇంటికి రావాలని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. ఇటు ఉద్యోగానికి వెళ్లక అటు ఇంట్లో కనిపించకుండా పోయిన వాసవి కోసం తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనిపించకుండాపోయిన అసిస్టెంట్ లోకో పైలట్ వాసవి ప్రభ కోసం తీవ్రంగా గాలిస్తున్నామమి సనత్ నగర్ సీఐ ముత్తూ యాదవ్ వెల్లడించారు. ఆమె తన వెంట ఏటీఎం, సెల్‌ఫోన్ వంటివి తీసుకెళ్లకపోవటంతో ఆచూకీ కనిపెట్టడం ఇబ్బందికరంగా మారిందన్నారు. భరత్ నగర్ వరకు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లిన సీసీ ఫుటేజ్ ఒకటే లభ్యమైందన్నారు. ఆమెకు కాబోయే భర్తను కూడా మూడుసార్లు స్టేషన్‌కి పిలిపించి విచారించామని తెలిపారు. తోటి ఉద్యోగులను కూడా ఆరా తీశామని అయినా ఫలితం లేకుండా పోయిందన్నారు. రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టామన్నారు.