నగరానికి చెందిన నార్త్‌జోన్‌లోని ఓ మహిళా ఇన్‌స్పెక్టర్ ఫోన్ నంబర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు డేటింగ్ యాప్ లో పోస్టు చేశారు. దీంతో ఆమెకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు, మెసేజ్‌లు వస్తుండడంతో ఆమె సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యింది. www.చాట్‌కరో.in ఆన్‌లైన్ చాటింగ్ వెబ్‌సైట్‌లో ఆమె అధికారిక ఫోన్ నంబర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అప్‌లోడ్ చేశారు. 14న అర్ధరాత్రి నుంచి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి పదుల సంఖ్యలో ఫోన్లు, అసభ్యకరమైన మెసేజ్‌లు ఆమెకు రావడంతో ఉలిక్కి పడింది. ఎక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయని ఆరా తీయడంతో చాటింగ్ సైట్‌లో గుర్తుతెలియని వ్యక్తులు నంబర్ పోస్టు చేసినట్లు గుర్తించి సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.