అమీర్‌పేట: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బీకేగూడలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఇన్స్‌పెక్టర్‌ మురళీకృష్ణ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జియాగూడకు చెందిన గౌరీ (34)కి 2011లో బీకేగూడకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కిరణ్‌కుమార్‌తో వివాహం జరిగింది.వీరికి ఒక కుమార్తె. శుక్రవారం ఉదయం ఇంట్లో గౌరి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల సమాచారంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరళిం చారు. కాగా గౌరీ అనారోగ్యంతో బాధడుతోందని, దీనికితోడు తరచూ భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి సుశీల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతురాలి భర్త అత్త, మామలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు.

కట్నం కోసం వేధిస్తున్నారు

పెళ్లి సమయంలో భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించామని గౌరి తల్లిదండ్రులు తెలిపారు. సత్యం కంప్యూటర్స్‌లో పనిచేసే కిరణ్‌ కుమార్‌కు ఉద్యోగం పోవడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడన్నారు. తరచూ డబ్బుల కోసం గౌరితో గొడవ పడేవాడని ఆరోపించారు. ఆరు నెలల క్రితం కూడా నాలుగు తులాల బంగారం ఇచ్చామన్నారు. పథకం ప్రకారం ఆమె భర్త, అత్త మామ గౌరిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.