లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మడికొండకు వచ్చిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌పై ఓ నాయకుడు ఒక్కసారిగా గొడవపడడంతో పాటు ఓ కార్యకర్త చేయిచేసుకున్న ఉదంతమిది. వివరాలిలా ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయంత్రం వరంగల్ నగరంలోని మడికొండ చౌరస్తా నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్యతో కలిసి మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ వద్ద మాట్లాడేందుకు ప్రచార రథం ఎక్కుతుండగా కొండేటి శ్రీధర్‌పై మడికొండకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఎడబోయిన ప్రభాకర్ ఒక్కసారిగా గొడవపడి చేయిచేసుకున్నాడు. దీంతో షాక్ గురైన కాంగ్రెస్ శ్రేణులు అతన్ని వెంటనే అక్కడి నుండి పక్కకు తీసుకుపోయారు. కార్యకర్తలను పట్టించుకోకపోగా తమకు సమాచారం లేకుండా ప్రచారానికి రావడం ఏంటని ప్రభాకర్ ప్రశ్నించారు. పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండక పోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు నాయకుడు గొడవపడ్డాడు. దీంతో చేసేదేమి లేక శ్రీధర్ వెళ్లిపోయారు…