మాటు వేసి, పథకం ప్రకారం యువకున్ని దారుణంగా హత్య చేసిన ఘటన రాజన్న నర్సింగాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మెరుపుల హరీష్(23) అనే యువకుడు వ్యవసాయ పొలం వద్ద ఉన్న పశువులకు నీళ్లు పెట్టి గుర్రం బుచ్చయ్య అనే వ్యక్తితో కలిసి ఆక్టివ్ హోండాపై తిరిగి వస్తుండగా చెరువు మత్తడి వద్ద మాటు వేసి ఇదే గ్రామానికి చెందిన నేరేళ్ల రమేష్, నేవూరి బాబులు కలిసి మంగళవారం మధ్యాహ్నం వేట కొడవలితో హరీష్ తలను నరికి కిరాతకంగా హత్య చేశారు.

హరీష్‌తో ద్విచక్ర వాహనంపై ఉన్న మరో వ్యక్తి బుచ్చయ్య దిగి పరుగులు తీయడంతో బతికి బయట పడ్డాడు. హరీష్‌ను హతమార్చి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో ద్విచక్ర వాహనంతో పాటు శవాన్ని పడేసారు. ఈ విషయాన్ని సాయంత్రం చందుర్తి పోలీసులకు సమాచారాన్ని ఇవ్వడంతో సంఘటన స్థలానికి వేములవాడ డిఎస్పి వెంకటరమణ, చందుర్తి ci విజయ్ కుమార్, si రవిలు రాత్రే చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి బావిలో నీటీ మోటారు పంపుల సహాయంతో రాత్రంతా తీయించారు. బుధవారం ఉదయాన్నే మృతదేహాన్ని బయటకు తీయడంతో తల నరికి ఉన్న తీరును చూసి గ్రామస్థులు తీవ్ర ఆవేశానికి లోనైయ్యారు. మృతదేహన్ని మంచంతో నిందితుని ఇంటికి తీసుకువచ్చేందుకు సిద్దమయ్యారు. వారిని అడ్డుకునేందుకు యత్నించి పోలీసులపై దాడి చేసేందుకు కూడా ఓ దశలో యత్నించారు.

దీంతో పోలీసులు ఒకడుగు వెనక్కి తగ్గారు. ఇదే అదనుగా భావించిన మృతుని బంధువులు, గ్రామస్థులు కలిసి శవాన్ని, నిందుతునిగా భావిస్తున్న రమేష్ ఇంట్లో వేసి దహనం చేసేందుకు యత్నించారు. అంతటితో ఆగకుండా నిందితుని ఇంట్లో ఉన్న ఫర్నిచర్, ధాన్యాన్ని, రసాయనిక ఎరువులను, ఇంటిని ధ్వంసం చేశారు. పరిస్థితి విషమించడంతో చందుర్తి సిఐ విజయ్‌కుమార్ వెంటనే రుద్రంగి, కోనరావుపేట, వేములవాడ రూరల్ ఎస్సైలు వెంకటేశ్వర్లు, నరేష్, శివకేశవులతో పాటు డిస్ట్రిక్ గార్డులను, వేములవాడ డీఎస్పీ వెంకటరమణలు సంఘటన స్థలానికి చేరుకొని ఉద్రిక్తత పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయినా శవాన్ని పోస్టుమార్టంకు తీసుకెళ్లొద్దని నిందుతుని ఇంట్లోనే దహనం చేస్తామంటూ మహిళ సంఘాల సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

సుమారు గంటకు పైగా డిఎస్పి వెంకటరమణ మృతుని బంధువులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. పోలీసుల బందోబస్తు మధ్యన శవాన్ని పోస్టుమార్టం కోసం సిరిసిల్లాకు పంపారు.