హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన సంఘటన మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం: పాండిచ్చేరికి చెందిన శర్వణప్రియ (25) ఓ ఫార్మసీలో ఉద్యోగిగా పనిచేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి జీవనం సాగిస్తుంది. ఈ నెల 10వ తేదీన సాయంత్రం 5 గంటల ప్రాంతంలో శర్వణ ప్రియను కలిసేందుకు చైన్నెలో వ్యాపారిగా కొనసాగుతున్న స్నేహితుడు శ్రీహరి రమేశ్‌( 25) హైదరాబాద్‌కు వచ్చాడు. కళాశాలలో చదువుకున్న సమయంలో ఇతనితో స్నేహం ఉంది. వీరిద్దరు కలిసి మాదాపూర్‌లోని చందానాయక్‌ తాండలో గోల్డెన్‌ హైవ్‌ ఓయోలో 308 రూంను బుక్‌ చేసుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరు కలిసి మద్యం సేవించారు. మరుసటి రోజు తెల్లవారు జామున శ్రీహరికి వాంతులు కావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. చికిత్స అనంతరం ఓయో రూంకు వచ్చిన శ్రీహరి రమేశ్‌ శర్వణప్రియ కుర్చీలో నిశ్చలంగా పడి ఉండడాన్ని చూసి అంబులెన్స్‌కు ఫోన్‌ చేశాడు.

ఓయో రూం సహాయక సిబ్బంది సహాయంతో ఆమెను అంబులెన్స్‌లో చేర్చి పరీక్షించగా అప్పటికే చనిపోయినట్లు అంబులెన్స్‌ సిబ్బంది నిర్ధారించారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు యువతి తల్లిదండ్రులకు విషయం తెల్పి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ నెల 11వ తేదీ ఉదయం 10.49 నిమిషాలకు రూం నుంచి యువతి ఫోన్‌చేసి సాయంత్రం వరకు ఉంటామని చెప్పిందన్నారు. ఆ తర్వాత ఆమెకు ఆకలి వేయడంతో జొమోటాలో ఫుడ్‌ ఆర్డర్‌ చేసిందన్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో శ్రీహరి గదికి వచ్చి చూడగా అప్పటికే యువతి అపస్మారక స్థితిలో ఉన్నట్టు తెలిపారు.