చేతులకు చెట్ల బెరడులాంటి మొలకలతో తాను అనుభవిస్తున్న బాధ వర్ణనాతీతంగా ఉందని ‘ట్రీ మ్యాన్‌’గా పేరొందిన బంగ్లాదేశ్‌ యువకుడు అబుల్‌ బజందర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. డాక్టర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా తన వ్యాధిని నయం చేయలేకపోతున్నారని, అందుకే చివరగా తన చేతుల్ని తొలగించుకోవాలనే నిర్ణయానికి వచ్చానని అబుల్‌ పేర్కొన్నాడు. అరుదైన సిండ్రోమ్‌ కారణంగా చేతులకు చెట్ల బెరుడుల్లా మొలకలు వచ్చే వ్యాధితో అబుల్‌ బాధపడుతున్నాడు. 2016 నుంచి ఇప్పటి వరకూ అతనికి డాక్టర్లు 25 శస్త్రచికిత్సలు చేశారు. ఆ జబ్బును నయం చేయగలమని వైద్యులు దృఢంగా నమ్ముతున్నప్పటికీ, ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో అబుల్‌ గతేడాది మే నుంచి చికిత్స తీసుకోవడం మానేశాడు. అయితే వ్యాధి తీవ్రత మరింత పెరగడంతో ఈ ఏడాది జనవరిలో తిరిగి ఆస్పత్రిలో చేరాడు. ‘ఈ బాధ భరించడం నా వల్ల కాదు. రాత్రులు సరిగా నిద్ర పట్టడం లేదు. డాక్టర్లకు నా చేతులు తొలగించమని చెప్పాను. అప్పుడైనా నాకు కొంచెం ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్నానని’ అబుల్‌ తన దీన స్థితిని వివరించాడు.