పరిసరాలను మైమరచి ముద్దుల్లో మునిగితేలితే ఎంత ప్రమాదమో తెలిపే ఘటన ఇది. అప్పటివరకు ఎంతో సరదాగా కనిపించిన ఓ జంట ఊహించని విధంగా ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నారు. ముద్దుల మైకంలో లోకాన్ని మరిచి ప్రాణాలు కోల్పోయారు. పెరులోని కుస్కోలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మేబెత్ ఎస్పీనాజ్ (34), హెక్టర్ వెదల్ (36) అనే జంట ఓ నైట్ క్లబ్ నుంచి ఇంటికి వెళ్తూ బెత్లెహెమ్ వంతెన పైకి చేరుకున్నారు. ఆ వంతెనపై జనసంచారం లేకపోవడంతో ఇద్దరూ ముద్దుల్లో మునిగితేలారు. ఈ సందర్భంగా మేబెత్ వంతెన రైలింగ్‌పై కూర్చొని హెక్టర్‌తో సరసాలాడింది. అతడిని కాళ్లతో గట్టిగా పట్టుకుంది. దీంతో హెక్టర్ ఆమెను ముద్దు పెట్టుకోడానికి ముందుకెళ్లాడు. అతడికి తన అదరాలు అందించకుండా ఆట పట్టించేందుకు ఆమె వెనక్కి వంగింది. దీంతో బ్యాలెన్స్ తప్పి ఇద్దరూ కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మేబెత్ మార్గ మధ్యలో మృతిచెందగా ఆమె ప్రియుడు హెక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ప్రమాదానికి ముందు వారు నైట్‌క్లబ్‌లో మద్యం సేవించినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన సీసీటీవీ కెమేరాలో రికార్డైంది.