ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని మూడు భాగాలు చేస్తూ కేంద్రం ప్రకటించింది. జమ్ము, కశ్మీర్‌, లద్దాక్‌ ప్రాంతాలను విడదీశారు. వీటిల్లో జమ్ము, కశ్మీర్‌లు అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుకాగా లద్దాక్‌ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. జమ్ము కశ్మీర్‌కు సంబంధించి కీలక పరిణామాలు వేగంగా చోటు చేసుకొన్నాయి. ఆర్టికల్‌ 370ను రద్దు , 35(ఏ) రద్దు , రాష్ట్ర విభజన అంశాలు ఏకకాలంలో రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. అదే సమయంలో ఆర్టికల్‌370 రద్దు చేస్తూ రాష్ట్రపతి వెనువెంటనే ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీలో భారతరాజ్యాంగం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. ఆర్టికల్‌ 370(3)తో జమ్ముకశ్మీర్‌ లెజిస్లేటీవ్‌ అసెంబ్లీగా మారుతుంది. జమ్ము కశ్మీర్‌ను తాము మిగిలిన దేశంతో అనుసంధానించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. భారత రాజ్యాంగం మొత్తం జమ్ము కశ్మీర్‌లో అమలవుతుందన్నారు.

ఇక 28 రాష్ర్టాలు 9 కేంద్ర పాలిత ప్రాంతాలు…

దేశంలో రాష్ర్టాల సంఖ్య 29 నుంచి 28కి తగ్గింది. జమ్మూకశ్మీర్ రాష్ర్టాన్ని కేంద్రం రెండు భాగాలుగా విభజన చేసింది. జమ్మూకశ్మీర్ నుంచి లడఖ్ ను వేరు చేసింది. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ-కశ్మీర్ ఏర్పడగా, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడింది. దీంతో రాష్ర్టాల సంఖ్య 28కి తగ్గింది. కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 9కి చేరింది. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడక ముందు మొత్తం 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు, 35ఏ రద్దు, రాష్ట్ర విభజన అంశాలను వెనువెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి గెజిట్ కూడా విడుదలైంది. దీంతో జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది.