హకీంపేట్ ఎయిర్ పోర్టులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికే కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఎప్పుడూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునే అధికార, విపక్ష నేతలు ఒకే వేదికపై కనిపించారు. విపక్ష నేతలను రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ పరిచయం చేశారు. ద్రౌపది ముర్ముకు ప్రజాప్రతినిధులను పరిచయం చేసే కార్యక్రమంలో బీఆర్ఎస్ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలతో పాటు స్వాగతం పలికేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా హాజరయ్యారు. దీంతో వరుస క్రమంలో నేతలంతా వేదికపైకి వస్తూంటే వాళ్లను రాష్ట్రపతికి కేసీఆర్ పరిచయం చేయగా వాళ్లు ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతూ ముందుకు సాగారు.

క్యూలో బీఆర్ఎస్ నేతల తర్వాత బండి సంజయ్ కూడా ఉన్నారు. ఆయన రావడానికి సంకోచిస్తుంటే వెంటనే స్పందించిన కేసీఆర్ బండి సంజయ్‌ని రావాలంటూ పిలిచారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతికి బండి సంజయ్‌ను పరిచయం చేశారు. ఇదే క్రమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా రావటంతో ఆయనను కూడా పరిచయం చేశారు. ఈ సన్నివేశం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. నిత్యం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసే బండి సంజయ్‌ బహిరంగ సభల్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా బండి సంజయ్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసే కేసీఆర్ ఓకే వేదికపైకి రావటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అందులోనూ బండి సంజయ్‌ను రాష్ట్రపతికి పరిచయం చేయటం మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఇదే అంశంపై సోషల్ మీడియాలో సర్వత్రా చర్చ జరుగుతోంది.